డేటింగ్ యాప్.. ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ యాప్‌ల ద్వారా యువతీ యువకుల పరిచయాలు.. ప్రేమలు.. బ్రేకప్‌లు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇది అంతటితోనే ఆగడంలేదు. ప్రేమ మోజులో కొందరు యువత మానసికంగా కుంగిపోతున్నారు. మరికొందరు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతడిపై కోపం పెంచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) నగరంలోని కేపీహెచ్‌బీ(KPHB) పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) (Khusboo Sharma) కేపీహెచ్‌బీ పరిధి వన్ సిటీలోని ఏ బ్లాక్‌లో ఉంటూ గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Software engineer)గా పనిచేస్తోంది.
ఖుష్భు శర్మకు ఓ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో నెల్లూరుకు చెందిన మనోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి మియాపూర్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఖుష్బు శర్మ అతడితో ప్రేమలో పడింది. మంగళవారం ఉదయం మనోజ్‌ను తన వద్దకు రమ్మని అడగగా తర్వాత వస్తానని చెప్పాడు. అతను రాకపోవడంతో కారులో మియాపూర్ బయలుదేరింది.
మార్గమధ్యలో మనోజ్ ఫోన్ చేసి వసంతనగర్ కమాన్ వద్ద ఉన్నానని, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది ఖుష్బు. మనోజ్ వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముక్కూమొహం తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడం ఫేస్‌బుక్ నుంచి మొదలైంది. అయితే సాధారణ పరిచయాలు, ఇష్టాల వరకు ఈ యాప్‌ల వినియోగం ఒకే. కానీ ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగించే విషయం.