నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మెట్రో (Metro) ప్రయాణ వేళలను పొడిగిస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) తెలిపారు. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు ఉంటుందన్నారు. కానీ న్యూయర్ వేడుకల సందర్బంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి 12.15 గంటలకు చివరి మెట్రో రైలు మొదలవుతుందన్నారు.
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెట్రోలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులంతా బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలని అన్నారు. మద్యం సేవించి ప్రయాణం చేసినా, తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది ఇలా వుంటే ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు సహా అన్ని ఫ్లై ఓవర్లను పోలీసులు మూసి వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఈ నెల 31న రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్టు మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప మిగిలిన అన్ని వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నామన్నారు.