సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య (R.Krishnaiah) లేఖ రాశారు. త్వరలో చేపట్టబోయే నామినేటెడ్, కార్పొరేషన్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నామినేటడ్ పదవుల్లో 50 శాతం పదవులను బీసీలకే కేటాయించాలని రేవంత్ రెడ్డిని ఆర్. కృష్ణయ్య కోరారు.
లేఖకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు బీసీలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. అందువల్ల పార్టీలో సమర్థులైన బీసీ నాయకులకు పదవులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామని చెప్పారు.
ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్, దేవాదాయ కమిటీలు, ఇతర నామినెటేడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. రాబోయే బడ్జెట్‌లో బీసీలకు రూ. 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని అడిగామని తెలిపారు.
ఇటీవల నియమించిన నలుగురు ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్క బీసీ వ్యక్తి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. కేబినెట్‌లో 50 శాతం కోటా బీసీలకు ఇవ్వాలని, బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి బీసీ కుటుంబానికి 20 లక్షలు చొప్పున మంజూరు చేయాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు మంజూరు చేయాలని కోరామన్నారు.