హైదరాబాద్(Hyderabad) నగరమంతా మేఘాలు కమ్ముకున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. ఇవాళ ఉదయమే పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నగరంలో వాతావరణం చల్లగా మారింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు వివరించారు.
ఈ ప్రభావంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, బోయిన్ పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్ని, అల్వాల్, తిరుమలగిరి, కూకట్ పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్, కైపర, ఈసీఐఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే రాత్రి వేళలో చలితో గజగజ వణుకుతున్న నగరవాసులు వర్షం తోడవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈ నెల 26 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.