పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్(Hyderabad)లో అర్ధరాత్రి భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా భారీగా తరలిస్తున్న నగదును మాదాపూర్ ఎస్వోటీ(SOT) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఇన్నోవా కారులో హవాలా డబ్బులు(Hawala money) తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విక్రమ్ అనే వ్యక్తి ఇన్నోవా క్రిస్టా కారులో వస్తుండగా కారును నిలిపారు.
అతడి కారును తనిఖీ చేయగా అందులో రూ.50లక్షల హవాలా డబ్బును గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఆ నగదును మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా.. ఇవన్నీ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన డబ్బులని చెప్పినా ఎస్వోటీ పోలీసులు వినిపించుకోలేదు.
నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విక్రమ్‌ను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద దొరికిన రూ.50లక్షలను ఐటీ శాఖకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.