హైదరాబాద్ (Hyderabad) కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలింది (Wall collapsed). ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
నిర్మాణంలో ఉన్న భవనం ఆరో అంతస్తులో కొందరు కూలీలు సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. ఇక్కడ సెంట్రింగ్ పనులు చేయడం కోసం ఐదో ఆంతస్థు స్లాబ్ ను ఆధారంగా చేసుకుని కర్రలతో సెంట్రింగ్ వేశారు. ఈ సెంట్రింగ్ పైనే వాళ్లు పనులు చేస్తునారు.
పనులు చేస్తున్న సమయంలో ఐదో అంతస్తులో ఉన్న గోడ కూలిపోయింది. దానిని ఆధారంగా చేసుకుని పెట్టిన సెంట్రింగ్ కర్రలు కూలిపోవడంతో ఆ సెంట్రింగ్ కర్రలపై పని చేస్తున్న ఆరో అంతస్థులో కూలీలు ఒక్కసారిగా కింద పడిపోయారు. దాంతో ముగ్గురు అక్కిడక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వర్షాలకు నిర్మాణ పనులు జరుగుతున్న భవనం తడిసి ఈ గోడ కూలిందా లేక నిర్మాణ పనుల్లో లోపమా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరో వైపు ఈ ప్రమాదంలో మరణించిన కూలీల వివరాలు ఇంకా తెలియలేదు. వీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారనే దానిపై ఇంకా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.