ప్రపంచంలో అత్యద్భుతమైన నిర్మాణాల్లో అయోధ్య రామ మందిరం (Ram Mandhir)ఒకటి. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు ఈ ఆలయం ఒక నిలువెత్తు రూపం. ఎలాంటి ఇనుము ఉపయోగించకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. భారీ భూకంపాల (Earthquake)ను తట్టుకుని 2500 ఏండ్లు నిలిచి ఉండేలా ఈ ఆధ్యాత్మిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఆలయ అద్బుతమైన స్ట్రక్చరల్ డిజైన్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హైదరాబాద్ వాసి కావడం రాష్ట్ర ప్రజలు గర్వపడే విషయం.
ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ సీబీ సోంపురా రూపొందించిన ప్రతిష్టాత్మక రామమందిర 3D నిర్మాణ విశ్లేషణ, రూపకల్పన బాధ్యతను సీఎస్ఐఆర్, సీబీఆర్ఐ చేపట్టింది. రామ మందిర స్ట్రక్చరల్ డిజైన్, పునాదుల నిర్మాణాలను సీఎస్ఐఆర్ బృందం సభ్యులు పర్యవేక్షించారు. ఆ బృందంలో సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్‌చెర్ల కీలక పాత్ర పోషించారు.
సుమారు నాలుగేండ్ల పాటు రామ మందిర నిర్మాణంలో సీఎస్ఐఆర్ బృందం ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యవేక్షణ చేసింది. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ERT),మల్టి ఛానల్ అనాలిసిస్ ఆఫ్ సర్ఫేస్ వేవ్స్ (MASW)లను చేపట్టింది. డిజైన్ల నిర్మాణ వ్యయం, ఇతర అంశాలను టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS),నిర్మాణ పనులను ఎల్అండ్టీ సంస్థలకు అప్పగించింది.
ఈ ఆలయ నిర్మాణంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సోంపురా వంశస్థుల ప్రతినిధులు, టీసీఎస్ అధికారులు, ఎల్అండ్టీ సంస్థ ఇంజినీర్లు సీబీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్‌చెర్ల పలుమార్లు ఆలయం డిజైన్ పై చర్చించారు. అనంతరం ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. నివేదికలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఆదేశించింది.
2500 ఏండ్లు నిలిచి పోయేలా ఆలయ స్ట్రక్చరల్ డిజైన్‌ను డాక్టర్ ప్రదీప్ రామన్‌చెర్ల తన టీమ్ తో కలిసి రూపొందించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుమును ఉపయోగించకపోవడం గమనార్హం. మరోవైపు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తలుపులను హైదరాబాద్ కు చెందిన కంపెనీ తయారు చేస్తోంది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు.
న్యూ బోయినపల్లిలోని అనూరాధ టింబర్ డిపోలో ఈ తలుపులను తయారు చేస్తున్నారు. ఆలయానికి కావాల్సిన 100కు పైగా తలుపులను తాము తయారు చేస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని శరత్ బాబు తెలిపారు. రామ మందిర తలుపుల కోసం బల్లార్షా నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన టేకు కర్రను ఉపయోగిస్తున్నామన్నారు. 100 కలప కర్రలను తీసుకుంటే అందులో అత్యంత నాణ్యమైన 20 కలప ముక్కలను తీసుకుని తలుపులను రూపొందిస్తున్నామన్నారు. రామ మందిర తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఈనెల 22న జరగనుంది. అయితే.. ఆరోజే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు..? ప్రత్యేకతలు ఏంటనేది తర్వాతి కథనంలో చూద్దాం.