కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే (MLA) జగ్గారెడ్డి (Jaggareddy)నోరు విప్పితే చాలు ఏదో ఉపద్రవం రాజకీయాల్లో వస్తుందని అనుకుంటారు. ఆయన మాటలు అలా ఉంటాయి మరి.. ఒక్కోసారి ఎక్కువ దూకుడు మీద ఉంటారని, అప్పుడప్పుడు తనపనేదో తనదే అన్నట్టు ప్రవర్తిస్తారని సన్నిహితులు అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా అణుబాంబు లాంటి మాట వదిలాడు జగ్గారెడ్డి..
విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి (Sangareddy)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే పదేళ్లలో తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.. సంగారెడ్డితో పాటు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం తనపై ఉంటే.. తప్పకుండా వచ్చే పదేళ్లలో సీఎం అవుతానని జగ్గారెడ్డి షాకిచ్చారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అంటూ అభిమానులను ఉత్సాహ పరిచారు..
మరోవైపు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి దేనికైనా వెనుకాడనని అన్న జగ్గారెడ్డి.. తాను అందుబాటులో లేక పోయినా.. తన భార్యతో పాటు తన అనుచరులు సంగారెడ్డి ప్రజల వెంట ఉంటారని అన్నారు.. తన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా.. వెంటనే అక్కడ వాలిపోతానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఉందని జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి..