రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) కేసుపై ఎట్టకేలకు మాజీ సీఎం కేసీఆర్(Former Cm kcr) స్పందించారు.ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ.. ట్యాపింగ్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ విషయంపై ప్రెస్‌మీట్ నిర్వహించి అసలు వాస్తవాలను బయటపెడతానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
కానీ, అలాంటిదేమీ చేయలేదు. తాజాగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ.. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పేనని(Officers Mistake).. ఇందులో సీఎంకు గానీ, మంత్రులకు గానీ ఎటువంటి సంబంధం ఉండబోదని స్పష్టంచేశారు. ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ డ్యూటీ.. సీఎం, మంత్రులు దీనిలో ఇన్వాల్వ్ కారు. కావాలంటే ఏదైనా రిపోర్టులు అడుగుతారు.
అవి కూడా పూర్తిగా పరిపాలనా పరమైన అంశాలు ఉంటాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా అధికారి అక్రమంగా ట్యాపింగ్ చేస్తే దాని సంగతి డిపార్ట్‌మెంట్ లోని హైయ్యర్ అధికారులు చూసుకుంటారు. ట్యాపింగ్ పరికరాలు ఏం కొన్నారు. ఎలా ట్యాపింగ్ చేశారన్నది కూడా సీఎం పట్టించుకోవడని చెప్పుకొచ్చారు. రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్‌ను వాడుకున్నామో లేదో తనకు తెలియదని మాజీ సీఎం వెల్లడించారు.
‘ఫలానా వ్యక్తుల ఫోన్లను మేము ట్యాప్ చేసినం’ అని అధికారులు ఎప్పుడూ ముఖ్యమంత్రికి చెప్పరని వివరించారు.గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా ట్యాపింగ్ జరిగితే జరగొచ్చు ఒకరిద్దరివి.. అది కూడా లత్కోర్,లఫింగి గాళ్లవి చేసి ఉండొచ్చు. అందరివీ ఎందుకు చేస్తారంటూ కేసీఆర్ తనయుడి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఊతమిచ్చాయి.
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం అని ఇప్పటికే తేలిపోయింది. కొడుకు మొహమాటంగా చెప్పగా.. తండ్రి కేసీఆర్ మాత్రం దానికి తనకు సంబంధం లేదని కొట్టిపారేశారు.