ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మహారాష్ట్రలో పర్యటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా (PMAY )పథకం కింద మహారాష్ట్ర, షోలాపూర్‌లో నిర్మించిన ఇండ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఆ ఇండ్లను లబ్దిదారులకు ప్రధాని మోడీ అందజేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ పథకం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ….. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా కింద నిర్మించిన అతి పెద్ద సొసైటీని ఈ రోజు ప్రారంభించుకున్నామని చెప్పారు. 2104లో తాను హామీ ఇచ్చానన్నారు. ఇప్పుడు వాటిని పూర్తి చేశామని వెల్లడించారు. ఇది పరిపూర్ణమైన క్షణాలని పేర్కొన్నారు. ఈ ఇండ్లను చూస్తుంటే తనకు తన బాల్యం గుర్తుకు వస్తోందన్నారు.
తనకు కూడా చిన్న తనంలో ఇలాంటి ఇంట్లో ఉండే అవకాశం వస్తే ఎలా ఉండేదోనని ఆలోచిస్తున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. సోలాపూర్‌లో శ్రామికులు, వేలాది మంది పేదల కోసం తాము ఇచ్చిన హామీ ఈ రోజు నెరవేర్చడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన రోజునే ప్రజలకు ఓ మాట ఇచ్చానని వివరించారు.
మళ్లీ ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పేదలకు ఇంటి తాళపు చేతులు ఇచ్చేందుకు త్వరలోనే ఇక్కడికి వస్తానని చెప్పానన్నారు. అన్నట్టుగానే ఈ రోజు ఇక్కడకు వచ్చానని చెప్పారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దేశంలో చాలా ఏండ్ల క్రితమే గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చారన్నారు. కానీ పేదరికాన్ని నిర్మూలించలేదన్నారు. గత ప్రభత్వాలు పేదల పేరిట పథకాలు తీసుకు వచ్చాయని కానీ ఆ పథకాల ఫలాలు పేదలకు అందలేదని చెప్పారు.