భారత వైమానిక దళం (IAF) మరో ఘనత సాధించింది. మొట్ట మొదటిసారిగా కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో సీ-130జే ఎయిర్ క్రాఫ్ట్ (aircraft) చీకటిలో విజయవంతంగా ల్యాండ్ అయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)ఖాతాలో షేర్ చేసింది. వైమానిక దళానికి ఇది ఒక చారిత్రాత్మక విజయంగా అధికారులు వెల్లడించారు.
మొదటి సారిగా ఐఏఎఫ్ సీ-130 విమానం కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ అయినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. టెర్రెయిన్ మార్కింగ్ సాంకేతికతను ఉపయోగించి గరుడ శిక్షణా మిషన్‌ను కూడా పూర్తి చేసిందని పేర్కొంది. ఈ శిక్షణ మిషన్ గురించి భారత వైమానిక దళం పెద్దగా సమాచారం ఇవ్వలేదు.
హిమాలయ భూభాగంలో 8,800 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో అత్యంత కఠినమైన సీ-130జే విమానం విజయవంతంగా నైట్ ల్యాండింగ్ అయింది. భారత వైమానిక దళం, పైలట్ల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది అద్దం పడుతుంది. ఇది కఠినమైన వాతావరణంలో కూడా పని చేసే ఐఏఎఫ్ సామర్థ్యాన్ని తెలుపుతుంది.
గతేడాది నవంబర్‌లో వైమానిక దళం ఉత్తరాఖండ్ ఎయిర్‌స్ట్రిప్‌లో సీ-130జే-30 ‘సూపర్ హెర్క్యులస్’ సైనిక రవాణా విమానాల్లో రెండింటిని విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు దీన్ని ఉపయోగించారు. ఆ సమయంలో కార్మికులను రక్షించేందుకు భారీ ఇంజనీరింగ్ పరికరాలను మోసుకు వెళ్లేందుకు దీన్ని ఉపయోగించారు.