తెలంగాణ (Telangana) లో ఎన్నికల కోలాహలం నడుస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీ చేపట్టింది. అయితే.. తన బదిలీపై ఐఏఎస్ శ్రీదేవి (Sridevi) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈమె వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్నారు. అయితే.. తాను బదిలీ అయి కొద్ది రోజులే అవుతుంది. ఇంతలోనే మళ్లీనా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొత్తం 20 మంది అధికారులపై బదిలీ వేటు పడింది. వీరిలో నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఉన్నారు. వీరందరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని సీఎస్ కు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఐఏఎస్ శ్రీదేవి స్పందించారు.
కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు మూడు రోజుల ముందే తాను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. ఆ శాఖ పనితీరుకు తాను బాధ్యురాలిని ఎలా అవుతానని ప్రశ్నించారు. తాను రాక ముందు ఆ శాఖ పనితీరు బాగోలేకపోతే తననెలా బదిలీ చేస్తారని నిలదీశారు శ్రీదేవి. ఈ మేరకు ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టారు.
వారం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. పలు అంశాలపై నిశితంగా పరిశీలన చేసింది. పలు శాఖల అధికారులు, రాజకీయ నాయకులతో చర్చలు జరిపింది. అయితే.. కొందరు అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు విపక్ష నేతల నుంచి వినిపించాయి. ఈ క్రమంలోనే ఈసీ ఈ బదిలీ వేటు వేసిందనే ప్రచారం జరుగుతోంది.