Telugu News » Smita Sabarwal : సీతక్క పక్కన స్మితా సబర్వాల్.. ఏం జరుగుతోంది..?

Smita Sabarwal : సీతక్క పక్కన స్మితా సబర్వాల్.. ఏం జరుగుతోంది..?

కేసీఆర్ టీమ్‌ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్.. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. రేవంత్ ను కలవకపోవడంతో ఆమె.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

by admin
IAS Smita Sabharwal Meets Minister Seethakka At Secretariat 1

– ఎట్టకేలకు బయటకొచ్చిన స్మితా సబర్వాల్
– మంత్రి సీతక్క ఛాంబర్ లో ప్రత్యక్షం
– ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని స్పష్టం

బీఆర్ఎస్ (BRS) హయాంలో సీఎంవో (CMO) లో కీలక బాధ్యతలు నిర్వహించారు స్మితా సబర్వాల్ (Smita Sabarwal). నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ (Congress) వచ్చింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం అయ్యారు. దీంతో సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఆఖరికి ఢిల్లీలో ఉంటున్న ఆమ్రపాలి తీరిక చేసుకుని వచ్చి మరీ కలిశారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం కలవలేదు. అయితే.. సడెన్ గా గురువారం మంత్రి సీతక్క (Seethakka) పక్కన మెరిశారు.

IAS Smita Sabharwal Meets Minister Seethakka At Secretariat

గురువారం మంత్రి సీతక్క ఛాంబర్ లో ప్రత్యక్షమయ్యారు స్మితా సబర్వాల్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సీతక్క వేదపండితులతో పూజలు చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. మంత్రి సీతక్కకు ఆమె అభినందనలు తెలిపారు.

కేసీఆర్ టీమ్‌ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్.. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. రేవంత్ ను కలవకపోవడంతో ఆమె.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆమె స్పందిస్తూ.. ఆ వార్తలను ఖండించారు. అదంతా అవాస్తవమని ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. తాను తెలంగాణ కేడర్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారిగానే విధులను నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని.. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో సీఎంవో కార్యదర్శి హోదాతో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు స్మితా సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా ఆమె పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ.. తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈమెకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

You may also like

Leave a Comment