14 మంది బ్రాడ్ కాస్టింగ్ టీవీ యాంకర్ల(Anchors)ను బహిష్కరించాలని ఇండియా కూటమి(India Alliance)తీసుకున్న నిర్ణయంపై బీజేపీ(bjp) తీవ్ర విమర్శలు గుప్పించింది. మీడియాతో పాటు పలు సంస్థలను బహిష్కరిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి ఎంత మాత్రమూ మేలు చేయదని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర వెల్లడించారు.
రాహుల్ గాంధీని బహిష్కరిస్తేనే ఆ పార్టీకి మంచి లాభం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్, కోర్టులు సహా అన్నివ్యవస్థలపై విపక్ష కూటమి దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇండియా కూటమి దాడికి గురికానీ వ్యవస్థ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నేతలంతా ఎవరి పనులు వారు బాగానే చేస్తున్నారని అన్నారు. కానీ తన పని తాను సరిగా చేయని ఏకైక వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. అందుకే ఆయన్ని బాయ్ కాట్ చేస్తే ఆ పార్టీకి చాలా మంచిదని సూచించారు. ఓ వైపు ప్రేమ గురించి మాట్లాడుతూనే మరో వైపు ద్వేషాన్ని రాహుల్ గాంధీ రెచ్చ గొడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.
మీడియాను టార్గెట్ చేయడం కాంగ్రెస్ కొత్త కాదన్నారు. గతంలో భావ ప్రకటన స్వేచ్ఛకు కళ్లెం వేస్తూ నెహ్రూ సవరణలు తీసుకు వచ్చారని ఫైర్ అయ్యారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించడం, రాజీవ్ గాంధీ ‘పరువునష్టం చట్టం’ ప్రతిపాదన దానికి చక్కని ఉదాహరణలని సంబిత్ పాత్ర చెప్పారు.
కాంగ్రెస్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్న పలు మీడియా ఛానెల్స్, యాంకర్స్ ను బహిష్కరించాలని నిర్ణయించింది. మొత్తం 14 ఛానెల్స్ యాంకర్స్ నిర్వహించే షోలకు హాజరు కావద్దని నిర్ణయించింది. దీంతో ఆ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.