– శివ బాలకృష్ణ కేసులో ట్విస్ట్
– తెరపైకి ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు!
– బాలకృష్ణ ద్వారా అడ్డగోలు అనుమతులు
– అరవింద్ ఒత్తిడితో నార్సింగిలో వివాదాస్పద భూమి క్లియరెన్స్
– ఎస్ఎస్వీ ప్రాజెక్టు అనుమతి కోసం రూ.10 కోట్ల డిమాండ్
– మహేశ్వరంలో మరో ఇష్యూలో కోటి
– దందాలకు ప్లాట్లు, డబ్బుల రూపంలో లబ్ధి
– తెరపైకి రజత్ కుమార్ భూ వ్యవహారం
– మహబూబ్ నగర్ లో 52 ఎకరాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి అధికారులకు చుక్కలు కనపడుతున్నాయి. గత బీఆర్ఎస్ (BRS) హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు.. ఇప్పుడు భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు. ఆయన అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. శివ బాలకృష్ణ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఐఏఎస్ లు భారీగా అక్రమాలకు పాల్పడినట్టు తెలుసుకున్నారు అధికారులు.
తెరపైకి అరవింద్ కుమార్ పేరు
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ అరవింద్ కుమార్.. శివ బాలకృష్ణతో ఇష్టం వచ్చినట్టు తనకు అనుకూలమైన వారికి అనుమతులు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరీడ్ భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నట్టు ఏసీబీ విచారణలో గుర్తించినట్టు సమాచారం. ఆ సమయంలో ప్రతి ఫైల్ కు బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ ముడుపులు తీసుకున్నారని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలకృష్ణ బదిలీ కాకుండా అరవింద్ కాపాడుతూ వచ్చారని తన స్టేట్ మెంట్ రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో అరవింద్ కుమార్ 10 కోట్లు డిమాండ్ చేసినట్లుగా, అందులో షేక్ సైదా అనే వ్యక్తి కోటి ఇచ్చినట్లుగా శివ బాలకృష్ణ వెల్లడించారని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది.
అంతే కాకుండా పలు రియల్ ఎస్టేట్ కపెనీల నుంచి అరవింద్ కమీషన్లు తీసుకున్నారని, కొంత మంది ఐఏఎస్ భూములు కూడా ఇప్పించారని శివ బాలకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ నివాసంపై జరిపిన దాడులు, కస్టడీ విచారణతో రూ.250 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. భారీ ఎత్తున మనీలాండరింగ్ జరగడంతో ఈడీ, ఐటీలు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇదే సమయంలో అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
రజత్ కుమార్ భూముల వ్యవహారం
ఇటీవల మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాల భూ వ్యవహారం సంచలనం రేపింది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. శివ బాలకృష్ణ వ్యవహారంలో అరవింద్ కుమార్ కూడా చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో కీలక అధికారిగా పనిచేసిన రజత్ కుమార్ భూ వ్యవహారం తెరపైకి వచ్చింది.
రజత్ కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 52 ఎకరాల భూములు ఉన్నట్టు వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్ నగర్ జిల్లా హేమాజిపూర్ లో రజత్ కుమార్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నట్టు తెలుస్తోంది. సర్వే నంబర్ 83,84,85 సర్వే నెంబర్లలో ఈ భూములు ఉన్నట్టు, రజత్ కుమార్ పేరు మీదనే 15 ఎకరాల భూమి ఉన్నట్టు సమాచారం. వరుసగా ఐఏఎస్ లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రజత్ కుమార్ జాగ్రత్త పడుతున్నారని.. ఆ భూములను ఇతరుల పేరు మీదకి మార్చేందుకు స్లాట్ కూడా బుక్ చేశారని ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఈ భూములను ఇతరుల పేరుపైకి మారిపోయే అవకాశం ఉందని.. అదే జరిగితే ఆయన అక్రమాలను గుర్తించడం ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ హయాంలోనే కొన్నానంటున్న రజత్ కుమార్
తనపై వస్తున్న ఆరోపణలపై రజత్ కుమార్ స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2013-2014లో జీఏడీ పర్మిషన్ తో భూమి కొనుగోలు చేశానని చెప్పారు. తాను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉందని అన్నారు. అదే భూమిని 2021లో అమ్ముకున్నానని వెల్లడించారు. 2019లో కూడా తనపై ఇలాంటి తప్పుడు ప్రచారమే చేశారని గుర్తుచేశారు.
అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కాంట్రాక్టులు, పనుల విషయంలో రజత్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కుమార్తె పెళ్లికి మేఘా సంస్థ డబ్బులు ఖర్చు పెట్టినట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అవినీతి అధికారుల దందాలు బయటకు వస్తుండడంతో రజత్ కుమార్ భూ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.