Telugu News » Delhi : ప్రధాని మోడీతో ముగిసిన సమావేశం.. సీఎం జగన్‌ చర్చించిన అంశాలివే..!

Delhi : ప్రధాని మోడీతో ముగిసిన సమావేశం.. సీఎం జగన్‌ చర్చించిన అంశాలివే..!

ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఏపీ అంశాల్ని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్. ప్రధానికి కొన్ని వినతిపత్రాలు కూడా ఇస్తూ వచ్చారు. ఐతే.. ఈసారి మీటింగ్‌ చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

by Venu

ఢిల్లీ (Delhi) పర్యటనలో ఏపీ (AP) సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) బిజీ బిజీగా ఉన్నారు. తన పార్టీ ఎంపీలతో కలిసి ఇవాళ పార్లమెంట్‌కు వెళ్ళిన ముఖ్యమంత్రి ముందుగా ప్రధాని మోడీతో (PM Modi) సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర పాటు ప్రధాని కార్యాలయంలో వీరి మీటింగ్‌ కొనసాగింది. ఇందులో పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతో పాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఏపీ అంశాల్ని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్. ప్రధానికి కొన్ని వినతిపత్రాలు కూడా ఇస్తూ వచ్చారు. ఐతే.. ఈసారి మీటింగ్‌ చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌, హోమంత్రి అమిత్‌షా కూడా అక్కడే ఉన్నారు.

ప్రధాని మోడీ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ కానున్నారు. ఏపీకి రావల్సిన నిధులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి బాబు తిరిగి వచ్చిన తరువాత జగన్ ఇవాళ ప్రధానితో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ ఒకే చెప్పిందని సీఎంవో తెలిపింది.

తెలంగాణ రాష్ట్రానికి 2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని ప్రధానమంత్రిని సీఎం కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం.. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా.. భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని.. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం, కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని జగన్ కోరారు.

You may also like

Leave a Comment