అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు షాక్ తగిలింది. బైడెన్ పై అభిశంసన విచారణకు ఆ దేశ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్కార్తి అనుమతించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బైడెన్ పై అభిశంసన విచారణను ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆయన ఆదేశించారు.
బరాక్ ఒబామా ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్ గా బైడెన్ ఉన్న సమయంలో ఆయన కుమారుడు హంటర్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. ఆ సమయంలో విదేశీ వ్యాపారాలకు సంబంధించి లావాదేవీల విషయాలను దాచి పెట్టారని బైడెన్ పై ఆరోపణలు వున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
బైడెన్ తన కుమారుడు హంట్ విదేశీ వ్యాపార లావాదేవీల గురించి అమెరికా ప్రజలకు అసత్యాలు వెల్లడించారని మెక్ కార్తీ పేర్కొన్నారు. అందుకే ఆయనపై అభిశంసన విచారణను ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విచారణను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది.
బైడెన్ పై హౌస్ రిపబ్లికన్స్ గత తొమ్మిది నెలలుగా దర్యాప్తు జరుపుతున్నారని శ్వేత సౌదం పేర్కొంది. బైడెన్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను వాళ్లు సేకరించలేకపోయారని తెలిపింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తోందని వైట్ హౌస్ ప్రతినిధి ఇయాన్ సామ్స్ అన్నారు.
ఉక్రెయిన్ కు చెందిన ఓ ఇంధన కంపెనీలో బైడెన్ కుమారుడు హంటర్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సంస్థ నుంచి బైడెన్లకు భారీగా ముడుపులు అందాయని రిపబ్లికన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ డెమోక్రట్లు రెండు సార్లు అభిశంసన తీర్మానాలను ప్రవేశ పెట్టారు. దీనికి ప్రతీకార చర్యగా బైడెన్ను అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు.