జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో ఉగ్రవేట కొనసాగుతోంది. అనంత నాగ్(Anantha nag) జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ 5వ రోజుకు చేరుకుంది. వందలాది మంది సైనికులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా గడోల్ లోని దట్టమైన అరణ్యంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ముష్కరులు వ్యూహాత్మకంగా దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని కాల్పులు జరపుతున్నారని అధికారులు చెబుుతున్నారు. అందుకే బుధవారం మొదలైన ఆపరేషన్ ఇప్పటి వరకు కొనసాగుతోందని వివరిస్తున్నారు. మొత్తం ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు దట్టమైన అటవిలో నక్కి వున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
దాడులకు ఉగ్రమూకలు కొత్త పద్దతిని ఉపయోగిస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోందంటున్నారు. ఈ 100 గంటల్లో ఉగ్రమూకలు నక్కి వున్న ప్రాంతంపై భద్రతా దళాలు వందలాది మోటార్ షెల్స్, రాకెట్లు, అధునాతన ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. మరింత అడ్వాన్స్డ్ డ్రోన్స్ సహాయంతో ఉగ్రస్థావరాలపై భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతాలు, హై అల్టిట్యూడ్ ఏరియాలో యుద్ద విద్యల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందినట్టు కనిపిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాంటి ప్రాంతంలో లాజిస్టిక్ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చాలా సమయం పట్టి వుండవచ్చని అంటున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఎదుర్కోవటం చాలా కష్టంతో కూడుకున్న పని పేర్కొంటున్నాయి. అందుకే ఆపరేషన్ ఆలస్యం అవుతోందంటున్నాయి.