2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరవసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. ఈ సారి బడ్జెట్లో పన్ను స్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్ కు సంబంధించిన కాపీని ఈ సారి డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే సందర్బంగా నిర్మలా సీతారామాన్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యతనిచ్చిందని వెల్లడించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు అనే కులాలను శక్తివంతం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు.
దేశంలో 30 కోట్లమంది మహిళలకు ముద్ర రుణాలు అందజేశామని వివరించారు. ముద్ర యోజన ద్వారా దేశంలో యువతకు రూ. 25 లక్షల కోట్ల రుణాలను అందించామని తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతను తీసుకు వచ్చి విలువ జోడింపు ద్వారా కొత్త విధానాలు అమలులోకి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు.
4.5 కోట్ల మందికి బీమా సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11.8 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికసాయం అందించామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో రూ.34 లక్షల కోట్లు పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిమని వివరించారు. 3 వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు కొత్తగా ప్రారంభించామని…స్టార్టప్ ఇండియా స్టార్టప్ సపోర్టు ద్వారా యువతను కొత్త పారిశ్రామికులుగా తయారుచేశామని పేర్కొన్నారు.