వైజాగ్ (Vizag) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇలా అజేయ ద్వి శతకంతో టీమిండియా (Team India)ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నాడు. అదీగాక ఈ డబుల్ సెంచరీతో అరుదైన రికార్డును తన పేరిట యశస్వి లిఖించుకొన్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో తక్కువ వయసులో ద్వి శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ ఈ రికార్డును నమోదు చేశారు. ఇక యశస్వి ఒంటరి పోరాటంతో టీమిండియా నాలుగు వందల స్కోరు దిశగా పయనిస్తోంది. మరోవైపు ఇతర బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ యశస్వి జైస్వాల్ దుమ్ము రేపడంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
ఇక 280 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 7 సిక్సులతో 207 పరుగులు చేసి క్రీజులో ఉన్న జైస్వాల్‌కు తోడుగా కుల్‌దీప్ (Kuldeep) క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు సొంతగడ్డపై కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ బాదడం విశేషం.
అంతేకాదు టెస్టుల్లో 22 ఏండ్ల వయసులోనే యశస్వీ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఇదివరకు వినోద్ కాంబ్లీ 21 ఏండ్ల 35 రోజుల వయసులో ద్విశతకం కొట్టాడు. ఆ తర్వాత 21 ఏండ్ల 283 రోజులు వయస్సులో సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ కొట్టాడు. ఓవర్‌నైట్ స్టోర్ 336/6 తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను అండర్సన్ దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకున్న అశ్విన్ ను ఔట్ చేశాడు. దాంతో 364 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.