వన్డే ప్రపంచకప్-2023లో భారత్ విశ్వరూపాన్ని చూపిస్తోంది. జోరుమీదున్న భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా వరుసగా తొమ్మిదో విజయం సాధించేందుకు సిద్ధమైంది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ సేన మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
జోరుమీదున్న బ్యాటర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. అయితే జట్టులో ఒకటీ, రెండు మార్పులను కొట్టిపారేయలేం. జస్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ కృష్ణ, ఆర్ అశ్విన్‌ను తీసుకోవచ్చు. భారత్ బాగా ఆడుతున్నా.. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది.
2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గింది. మరోవైపు స్వదేశానికి వెళ్లిపోయే ముందు గట్టి పోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. భారత తుది జట్టులో మార్పులు జరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేకపోవడం ప్లస్ పాయింట్. ఇవాళ దీపావళి పండుగ వేళ భారత్ విజయం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ కొత్త రికార్డు నమోదవడం ఖాయం.
ప్రపంచకప్ 2023లో ఇక్కడ పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కూడా పాక్‌పై 401 పరుగులు బాదింది. మొదట భారత్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్య.. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య ఫామ్‌లోకి రావడానికి నెదర్లాండ్స్ మంచి అవకాశమనే చెప్పాలి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ పరుగుల వరద పారడం ఖాయం.
భారత్ జట్టులో రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్ లేదా అశ్విన్, బుమ్రా లేదా ప్రసిద్ధ, షమీ, సిరాజ్‌లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెదర్లాండ్స్‌లో ఒదౌడ్, బారెసి, ఆకర్మ్యాన్, సిబ్రాండ్, ఎడ్వర్డ్స్, డి లీడ్, తేజ నిడమానూరు, వాన్ బీక్, వాండెర్మెర్స్, ఆర్యన్ దత్, మీకెరన్ భారత్‌తో తలపడనున్నారు.