సఫారీలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు(Team India) ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా (South Africa)లో న్యూ వాండరర్స్ (జోహెన్నస్ బర్గ్) వేదిక జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టును భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టోనీ జీ జోర్జీ (28), ఆండిలే ఫెహ్లుక్వాయో(33) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. దీంతో 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్షదీప్ పది ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశారు. మరో బౌలర్ ఆవేశ్ ఖాన్ 8 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, కులదీప్ యాదవ్ 2.3 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నిరాశ పరిచాడు. కేవలం 5 పరుగులు చేసి వియాన్ ముల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ అద్బుతమైన ఆట తీరుకనబరిచాడు. సాయి సుదర్శన్ 43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్ గా నిలిచాడు.
అటు వన్ డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆచి తూచి ఆడాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఒక పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 16.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి భారత్ విజయ లక్ష్యాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో చెరో వికెట్ తీశారు.