దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Team India) దుమ్ము లేపింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ను కంప్లీట్ చేసింది. భారత బౌలర్ల దాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ ముందు దక్షిణాఫ్రికా 79 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలో భారత్ పూర్తి చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 28 పరుగులు చేశారు. 44 పరుగుల వద్ద నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో త్రిస్థాన్ స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్ గిల్ (10) పరుగులు చేశారు. మరో ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 17 నాటౌట్ గా ఉన్నారు. అటు శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
సఫారీ బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు 62/3 ఓవర్‌నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా జట్టు రెండవ రోజు ఆట ప్రారంభించింది. రెండవ రోజు సఫారీలు కేవలం మరో 114 పరుగులు చేసి చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్ క్రమ్ ఈ రోజు సెంచరీ పూర్తి చేశాడు. మార్ క్రమ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో 176 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 153 పరుగులు చేసింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ లో భారత్ ముందు 78 పరుగుల లక్ష్యం ఉంది. దీన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ భూమ్రా 6 వికెట్లు, ముఖేశ్ కుమార్ 2 వికెట్లు, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికేట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాపై మహ్మద్ సిరాజ్ బౌలింగ్ తో నిప్పులు చెరిగారు. తొమ్మిది ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశారు. దీంతో తొలి సెషన్లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991 తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36) విరాట్ కోహ్లీ (46) పరుగులు చేశారు. ఆ తర్వాత 153 పరుగుల ఐదుగురు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. దీంతో భారత్ కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.