టీమిండియా-దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20(T-20) మ్యాచ్ వర్షం వల్ల బంతి కూడా పడుకుండానే రద్దయిన విషయం తెలిసిందే. డర్బన్‌లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయడం సాధ్యం కాలేదు. అయితే, వర్షం పడుతున్న సమయంలో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పకుండా కేవలం పిచ్ వరకే కప్పారు.
అయితే పిచ్ వరకే కవర్లను కప్పడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(SA Cricket Board)పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బుల్లేవా అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ప్రశ్నించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ.. మైదానాన్ని కవర్స్‌తో కప్పి ఉంచనందుకే వన్డే ప్రపంచకప్ 2019లో ఎన్నో మ్యాచ్‌లు రద్దయ్యాయని గుర్తుచేశాడు.
మైదానం మొత్తం కవర్స్ కప్పి ఉంచకపోతే వర్షం ఆగిన తర్వాత కూడా మ్యాచ్ ప్రారంభానికి మరో గంట ఎదురుచూడాల్సి వస్తుందని గవాస్కర్ తెలిపాడు. మరోసారి వర్షం కురిస్తే మ్యాచ్ కొనసాగదని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పాడు. అయితే, 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌లో వాతావరణం అందరినీ నిరాశపరిచిందని ఈ బ్యాటింగ్ ఐకాన్ గుర్తుచేశాడు.
వర్షం ఆగినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో చాలా జట్లు పాయింట్లు కోల్పోయాయని గవాస్కర్ తెలిపాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దు అయ్యాయని చెప్పాడు. క్రికెట్ బోర్డులకు చాలా డబ్బు వస్తుందని, డబ్బులు లేవని చెబితే అబద్ధం చెబుతున్నట్లేనని చెప్పుకొచ్చాడు. ఈడెన్ మైదానాన్ని గొప్పగా తయారు చేయడానికి సౌరవ్ గంగూలీ కారణమని గవాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.