సనాతన ధర్మంపై డీఎంకే(Dmk) మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్(Udaya nidhi stalin) చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొదట ప్రేమ దుకాణాన్ని(మొహబత్ కీ దుకాణ్) ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు.
కానీ దానికి బదులుగా కాంగ్రెస్ ఇప్పుడు విద్వేష మెగా మాల్ ను నిర్మించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు నేతలు సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెబుతున్నారని అన్నారు. దీంతో విద్వేష దుకాణం తెరిచేందుకు వాళ్లకు రాహుల్ గాంధీ లైసెన్స్ ఇచ్చినట్టు స్పష్టం అవుతోందని తెలిపారు.
ఇటీవల సనాతన ధర్మంపై తమిళ నాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందన్నారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదన్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు మద్దతు పలికారు.
ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మ పునాదులను కూల్చి వేయాలని గర్విష్టుల (గమాండియా) కూటమి దురాలోచనలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేశారని, రేపు మనపై నేరుగా దాడులను పెంచుతారని అన్నారు. అందువల్ల అంతా జాగ్రత్తగా వుండాలన్నారు.