విపక్ష ఇండియా కూటమి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి దాకా సమావేశాలతో బిజీ బిజీగా వున్న ఇండియా కూటమి ఇప్పుడు బహిరంగ ర్యాలీలపై దృష్టి పెట్టింది. తమ మొదటి బహిరంగ ర్యాలీని మధ్యప్రదేశ్లో నిర్వహించనున్నట్టు కూటమి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏర్పాట్లు మొదలు పెట్టనున్నట్టు పేర్కొన్నాయి.
త్వరలో ఎన్నికలు జరగబోయే మధ్య ప్రదేశ్లో మొదటి బహిరంగ ర్యాలీని నిర్వహించనున్నట్టు డీఎంకే నేత టీఆర్ బాలు వెల్లడించారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకం అంశంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దీని గురించి వివిధ రాష్ట్రాల్లో పార్టీలతో చర్చలు జరపనున్నట్టు వెల్లడించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చలను విపక్ష కూటమి త్వరలోనే ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఈ చర్చల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇది ఇలా వుంటే విపక్ష ఇండియా కూటమి కో ఆర్డినేషన్ కమిటీ మొదటి సమావేశం ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో జరిగింది.
ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీట్ల పంపకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నట్టు విపక్ష కూటమి సభ్యులు పేర్కొన్నారు.