భారత (Bharath) స్టాక్ మార్కెట్ (Stock Market) సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యధిక ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది. డిసెంబర్ 5న తొలిసారిగా దేశీయ మార్కెట్ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇందులో దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు గత నాలుగేళ్లలో వచ్చాయి.
వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, బలమైన కార్పొరేట్ ఆదాయాల కారణంగా భారతదేశంలో ఈక్విటీలు వేగంగా పెరుగుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన షేర్ల సంయుక్త విలువ సోమవారం నాటికి USD 4.33 ట్రిలియన్లకు చేరుకొంది. ఇదే సమయంలో హాంకాంగ్ (Hong Kong)కు USD 4.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
భారత్ కంటే ముందు మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్ ఉన్నాయి. అమెరికా 50.86 ట్రిలియన్ డాలర్లతో తొలిస్థానంలో ఉండగా, 8.44 ట్రిలియన్ డాలర్లతో చైనా, 6.3 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అండ్ హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకొన్నప్పటి నుండి S6 ట్రిలియన్లకు పైగా పడిపోయింది. హాంకాంగ్‌లో కొత్త లిస్టులు ఎండిపోయాయి.
మరోవైపు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా (China)కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు భారత్ కనపడుతోంది. ఫలితంగా భారత మార్కెట్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు, కంపెనీల నుంచి మూలధనాన్ని ఆకర్షించడంలో సఫలీకృతమవుతోంది. సుస్థిర రాజకీయ వాతావరణం కూడా భారత మార్కెట్ పెరగడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.