లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ (Hafiz Saeed)ను భారత్ (India)కు అప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని (Pakisthan)ను కేంద్రం కోరినట్టు తెలుస్తోంది. అప్పుడే భారత చట్టాల ప్రకారం నిందితున్ని విచారించగలమని చెప్పినట్టు సమాచారం.
ఈ మేరకు సయీద్‌ను అప్పగించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని పాక్ ప్రభుత్వానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేఖ రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని అటు పాక్ ప్రభుత్వం గానీ, ఇటు భారత ప్రభుత్వం గానీ ధ్రువీకరించలేదు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో సయీద్ ఒకడు.
2008లో ముంబై ఉగ్రదాడుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీద్ పై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల నజారానా ప్రకటించింది. సయీద్‌ను అప్పగించాలని భారత్ పదే పదే కోరుతున్నా దీనిపై పాక్ స్పందించడం లేదు. భారత్ – పాకిస్తాన్ మధ్య ఖైదీల అప్పగింతలకు సంబంధించి ఒప్పందాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ మరింత కష్టతరంగా మారింది.
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై హఫీజ్ 2019లో అరెస్టు అయ్యాడు. 2022 ఏప్రిల్‌లో సయీద్‌కు పాక్ న్యాయస్థానం 31 ఏండ్ల జైలు శిక్ష విధించినట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అతను జైలు శిక్ష అనుభవిస్తున్నారా లేదా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. 2017లో అతను గృహ నిర్బంధం నుంచి విడుదలైనప్పటి నుంచి స్వేచ్చగా సంచరిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.