భారత్‌లో మాల్దీవుల ( Maldives) హైకమిషనర్ ఇబ్రహీం షాహీద్ (Ibrahim Shaheeb) కు భారత విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని హైకమిషనర్ ను విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై లేఖలో విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సౌత్ బ్లాక్ కు ఇబ్రహీం షాహీద్ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆయన విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లి పోయారు. మరోవైపు దీనికి ప్రతిగా మాల్దీవులలోని బారత హైకమిషనర్ మును మహావర్ కు మాల్దీవుల ప్రభుత్వం పిలిపించుకుంది.
ఇది ముందే నిర్ణయించిన సమావేశామని మహావర్ వెల్లడించారు. మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ లార్జ్ అంబాసిడర్ నసీర్ మహ్మద్ తో మహావర్ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇది ఇలావుంటే భారత్ పై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది.
విదేశీ నాయకులు, ముఖ్యంగా తమ సన్నిహితమైన దేశమైన భారత్‌పై తమ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. తమ భాగస్వామ్య దేశాలన్నింటితో, ముఖ్యంగా పొరుగు దేశాలతో సానుకూల, నిర్మాణాత్మక చర్చలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ వివరించారు.
లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల మోడీ అక్కడ పర్యటించారు. అక్కడ స్నోర్కెలింగ్ చేసి దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. సాహస యాత్రికులు తమ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని సూచించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. బీచ్ టూరిజంలో భారత్ తమతో పోటీ పడటంలో సవాళ్లు ఎదుర్కొంటోందని ఆ దేశ మంత్రులు కామెంట్స్ చేశారు. దీనిపై భారతీయ సెలబ్రిటీలు, నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ ఖండించారు. మాల్దీవులకు ఇండియా ఎప్పుడూ మంచి మిత్ర దేశంగానే ఉందని తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులు ఇలాంటి విద్వేష భాషను ఉపయోగించడం సరికాదని ఆయన విచారం వ్యక్తం చేశారు.