దేశ సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ (Communication System)ను మరింత బలోపేతం చేయాలని కేంద్ర హోం శాఖ (Union Home Ministry) నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన పలు ప్రాంతాల్లో 4జీ కమ్యూనికేషన్ ను విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో పాటు ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లో రూ. 1545.66 కోట్లతో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు వెల్లడించింది.
సుమారు 1,117 బోర్డర్ పోస్టులకు ఈ అత్యాధునిక 4 జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆరున్నరేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు కేంద్ర హోం శాఖ చెప్పింది.
కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్‌లో 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లడఖ్‌లో విస్తృతమైన 4జీ కవరేజీ కోసం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ఉన్నప్పటికీ, కొన్ని గ్రామాల్లోనే ఈ పురోగతి పరిమితమైంది. కేవలం తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి.
ఈ 4జీ కమ్యూనికేషన్ వల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా కార్యకలాపాలకు గొప్ప ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడనుంది. అదే సమయంలో రియల్ టైమ్‌లో సరిహద్దుల్లోని ఔట్ పోస్టులు సమాచారాన్ని వేగంగా పంచుకోగలవు. సరిహద్దుల్లో పరిసర ప్రాంతాల గురించి మంచి అవగాహనను పెంచుకునేందుకు, ఏదైనా భద్రతా పరమైన సమస్యలు వచ్చినప్పుడు త్వరగా స్పందించేందుకు వీలు కలగనుంది.