అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి(Indian student) నీల్ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్ మృతదేహాన్ని అతడు చదువుతున్న అమెరికా(USA)లోని పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్(Purdue University Campus)లోనే పోలీసులు గుర్తించారు.
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధ్రువీకరించారు. ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ఆదివారం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. మా అబ్బాయి నీల్ ఆచార్య జనవరి 28 నుంచి కనిపించడం లేదంటూ వాపోయింది.
అతడు అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడని, చివరిసారిగా ఉబర్ డ్రైవర్ పర్డ్యూ యూనివర్సిటీలో డ్రాప్ చేశాడని తెలిపింది. నీల్ ఆచార్య కోసం తాము వెతకుతున్నామని, ఏదైనా సమాచారం తెలిస్తే మాకు సాయం చేయాలంటూ గౌరీ ఆచార్య ఆ పోస్ట్‌లో కోరారు.
గౌరీ ఆచార్య పోస్ట్‌పై షికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నీల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.