కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore)లో లివింగ్ కాస్ట్ గురించి తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే అక్కడి ధరలు రెట్టింపు ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ.200 నుంచి రూ.500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ.500-1,000 చెల్లించుకోవాల్సిందే. అయితే, అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
బెంగళూరు విమానాశ్రయంలో ‘ఇందిరా క్యాంటీన్’ను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయంలో కేవలం రూ.10కే భోజనం, రూ.5కే అల్పాహారం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభించనుంది. మోనూను మార్చి ఇప్పుడు రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా వివిధ భోజనాలు వడ్డించనున్నారు.
బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం రూ.5కే అల్పాహారం, రూ.10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని వాటిని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం సిద్దరామయ్య ఇందిరా క్యాంటీన్లను పున:ప్రారంభిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖరీదైన ఫుడ్ అవుట్లెట్లలోనూ ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలనే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులకు గమ్యస్థానంగా ఉన్న బెంగళూరులోని నాడప్రభు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.