జీవితంలో ఎదగడానికి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని సరైన దిశలో ఉపయోగించుకొంటే.. విజయ తీరాలు వశం అవుతాయి.. ఈ అక్షరాలను అక్షర సత్యాలని నిరూపించింది ఓ గిరిజన యువతి.. కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన ఆ గిరిజన యువతి సక్సెస్ స్టోరీ వింటే.. ఆ పట్టుదలకు కాలం సైతం గులాం అయ్యింది. పేదరికం సైతం సలాం కొట్టింది కదా అని అనిపిస్తోంది.
అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా ఏం సాధించలేక సమయాన్ని ఐస్ క్రీమ్ లా కరిగించేస్తున్న నేటి కాలపు మనుషులు సిగ్గుపడేలా కెరటంలా ఎగిసిన ఈ యువతి పేరు మాలోత్ రజిత. ఈమెది కామారెడ్డి జిల్లా లింగంపేట (Lingampeta), మండలంలోని ఎక్కపల్లి తండా (Ekkapalli Tanda). అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువుల్లో ఎక్కడా తడబడలేదు. ఎల్లారెడ్డి కేజీబీజీవీలో 9వ తరగతి చదివే సమయంలో ఉపాధ్యాయులు ఓ కార్యక్రమానికి తీసుకు వెళ్లారు.
అక్కడకు ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అతిథిగా హాజరై ప్రసంగించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయం రజిత (Rajitha)లో స్ఫూర్తి నింపాయి. తాను కూడా ఎప్పటికైనా పూర్ణలా పర్వతారోహణ చేయాలని అప్పుడే నిశ్చయించుకొంది. ఆ ఆశయంతో ఎలాగోలా హైస్కూల్ చదువు పూర్తి చేసింది. తర్వాత మెదక్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడే తన ఆశయానికి పునాది పడింది.
మొదటి ఏడాదిలో కళాశాల తరపున పర్వతారోహకురాలిగా వెళ్లేందుకు అవకాశం వచ్చింది. కానీ భయంతో వెనుకంజ వేసింది రజిత. 2వ ఏడాదిలో మళ్లీ అవకాశం తలుపు తట్టడంతో ముందడుగు వేసింది. ఈ క్రమంలో కఠినమైన శిక్షణ, విపత్కర వాతావరణ పరిస్థితులు అధిగమించి కిలిమంజారోపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది.. తర్వాత ఎవరెస్టు ఎక్కేందుకూ అర్హత సాధించింది. ఇంతలో కరోనా వల్ల లాక్డౌన్ వచ్చింది. దీంతో తన కల కలగానే మిగిలిపోయింది.
ఆ తర్వాత చదువుపై దృష్టి సారించిన రజిత. డిగ్రీ పూర్తయ్యాక ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ కళాశాలలో బీపెడ్లో చేరింది. అనంతరం హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకొంది. ఇటీవలే ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఎన్నో కష్టాలను అధిగమించి.. పట్టుదలతో తన జీవితానికి అర్థాన్ని తెలిపిన రజిత.. నిరాశతో క్రుంగిపోతున్న ఎందరికో ఆదర్శం అని చర్చించుకొనేలా చేసింది..