తెలంగాణ (Telangana)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మరి కొన్ని గంటల్లో నూతన సీఎం (New CM), డిప్యూటీ సీఎం (Deputy CM)లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో పని చేసిన రిటైర్డ్ అధికారులు రాజీనామా చేస్తున్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి, ట్రాన్స్ కో-జెన్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు.
వారి రాజీనామా విషయాన్ని ఆయా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సీఎస్‌కు వారు రాజీనామా లేఖలు పంపినట్టు తెలిపాయి. తాజాగా మరోవైపు ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. ఆయన రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయన్ని 31 అక్టోబర్ 2020లో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది.
అంతకు ముందు పనిచేసిన నవీన్ చంద్ పదవీ విరమణ పొందటంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఇది ఇలా వుంటే మరి కొంత మంది అధికారులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పలువురు రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారంటూ రేవంత్ రెడ్డి పలు మార్లు విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం, మరోవైపు తమపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి సీఎంగా వస్తున్నారనే వార్తలు వస్తుండటంతో ఆయా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే వారంతా రాజీనామా చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు.