రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్(Inter Exams) ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు జరిగే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది హాజరు కావాల్సివుంది.
కాగా నిమిషం ఆలస్యం అయినా ఎగ్జామ్ హాల్(Exam Hall) లోకి అనుమతించలేదు అధికారులు. దీంతో చాలా మంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సివచ్చింది. కుత్బుల్లాపూర్ గాంధీ నగర్ లోని కేమ్ బ్రిడ్జ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు నాలుగు నిమిషాలు ఆలస్యంగా రావడంతో, పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించలేదు.
అదేవిధంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట ప్రభుత్వ బాలుర కళాశాలకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు వెనుదిరిగారు. బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్కు అధికారులు అనుమతించలేదు.
అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి 9గంటలకు రావాల్సి ఉండగా 9.09గంటలకు వచ్చింది. దీంతో అధికారులు ఆమెను వెనక్కి పంపించారు. పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో ఆ విద్యార్థిని కంటతడి పెట్టింది.