2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో కీలక ఘట్టమైన హల్వా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించింది. బడ్జెట్ సెషన్ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది.
సాధారణంగా బడ్జెట్ అంటే అన్ని వర్గాల ప్రజల్లో చాలా అంచనాలు ఉంటాయి. బడ్జెట్‌లో ఏవైనా అద్బుతమైన ప్రకటన ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తు ఉంటారు. కానీ ఈ సారి మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందే కుండ బద్దలు కొట్టారు. అయినప్పటికీ ఇంకా మార్కెట్ పరిశీలకులు, పెట్టుబడిదారులు ప్రభుత్వం నుంచి ఏదైనా అద్బుతమైన ప్రకటన ఉంటుందా అని ఆశిస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్‌లో ఈ సారి ఆరు కీలక రంగాలకు సంబంధించి మంచి వార్తను అందించే అకాశం ఉందని తెలుస్తోంది. 75 ఏండ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు విరాళాలు, ఉపసంహరణలపై పన్ను రాయితీలను పొడిగించే అవకాశం ఉంది. తద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చని కేంద్రం యోచిస్తోంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, యజమానుల విరాళాలకు సంబంధించి ట్యాక్స్ విషయంలో ఎంప్లాయిస్ ప్రావిండెంట్ ఫండ్ ఆఫీస్ సమానత్వం కోరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రకటనలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ఉపాధిని కల్పించేందుకు పీఎల్ఐ పరిధిని విస్తరించి వస్త్రాలు, నగలు, హస్తకళల వంటి రంగాలను చేర్చవచ్చని నిపుణులు అంటున్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని గణనీయంగా పెంచవచ్చంటున్నారు. రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచి అర్హులైన ప్రతి రైతుకూ సంస్థాగత రుణాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా కార్పొరెట్‌లకు కొత్త తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు గాను రాయితీతో కూడిన 15 శాతం ఆదాయపు పన్ను రేటును ఏడాది పాటు పొడిగించవచ్చంటున్నారు.