రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఇటీవల కాంగ్రెస్ (Congress) పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్దవ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందుకున్న వాళ్లు జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.
శ్రీ రాముడు కేవలం బీజేపీకి చెందిన ప్రైవేట్ ఆస్తి కాదని తెలిపారు. భగవాన్ శ్రీ రాముడు అందరికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. అందువల్ల ఆహ్వానం అందిన వారు, అందని వారు కూడా ప్రాణప్రతిష్టకు హాజరు కావాలన్నారు. ఆహ్వానం పంపేందుకు బీజేపీ నేతలు ఎవరంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వాళ్లు అయోధ్యలో బీజేపీ కార్యాలయాన్ని ఏమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అంతకు ముందు తాము అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. మతం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే ముందుకు తెచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందని ప్రకటనలో పేర్కొంది. 2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరామున్ని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పింది.