కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru) నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా బోర్లు ఎండిపోతున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోయాయి. దాంతో బెంగళూరులో నీటి సమస్య పెరిగింది. ఈ ప్రభావం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఒక్కో మ్యాచ్‌కు 75వేల లీటర్ల నీటి అవసరముండగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విన్నపం మేరకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) కీలక నిర్ణయం తీసుకొంది. వేస్ట్ వాటర్‌ను శుద్ధి చేసి చిన్నస్వామి స్టేడియానికి సరఫరా చేయాలని బీడబ్ల్యూఎస్ఎస్వో అధికారులు నిర్ణయించారు.
ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు. బీడబ్ల్యూఎస్ఎస్ఓ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లకు శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని తెలిపారు. కావేరీ నది, భూగర్భ జలాలను అస్సలు వాడటం లేదన్నారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో రామ్ ప్రసాద్ ఈ వివరణ ఇచ్చారు.