తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు (Dalita Bandhu) పథకం అబాసుపాలవుతోంది. ఇప్పటికే దళితబంధులో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో నేతల జోక్యం ఎక్కువ అవడం వల్ల దళితబంధు నిధులు దారిమళ్లుతున్నాయని అక్కడక్కడ నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే ఖమ్మం (Khammam) తో పాటు పలు జిల్లాలో చోటుచేసుకుంది.
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైరా ఎమ్మెల్యే (MLA) క్యాంపు కార్యాలయం ముందు దళితులు ఆందోళనకు దిగారు. వైరా మున్సిపాలిటీలోని పలు వార్డులకు చెందిన దళితులు అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులకు ఇచ్చిన దళితబంధును రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు.
ఇక గృహలక్ష్మి , దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ రఘునాధ పాలెం మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిల పక్షం ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేశారు. మంత్రి పువ్వాడ (Puvvada) కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య మహాలక్ష్మి చిన్ననాగారంలో పర్యటిస్తున్న సమయంలో గ్రామంలో ముళ్ల కంచె వేసి నిరసన తెలిపారు దళితులు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు హుజూర్ నగర్ నియోజకవర్గలోని పొనుగోడు గ్రామస్తులు కూడా సెమ్ సీన్ రిపీట్ చేశారు.