Telugu News » TDP: తెలంగాణలో టీడీపీ ఖతం అయ్యిందా.. కాసాని దారి ఎటువైపు..?

TDP: తెలంగాణలో టీడీపీ ఖతం అయ్యిందా.. కాసాని దారి ఎటువైపు..?

తెలంగాణ పై ఫోకస్ చేస్తే ఏపీలో ఓడిపోతామనే భయమే ఇప్పుడు టీడీపీని వెంటాడుతుందని నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికే నిరాశలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar)ఇప్పుడు పార్టీ నుంచి తప్పుకున్నారు. తన భవిష్య కార్యాచరణను ఆయన ప్రకటించబోతున్నారు.

by Venu

తెలంగాణ (Telangana)లో తెలుగుదేశం పార్టీ పని ఖతం అయ్యిందా ! అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన ఊపిరితో ఉన్న టీడీపీ (TDP) బలమైన నేతను కోల్పోవడంతో దాదాపుగా తెలంగాణలో టీడీపీ తుడుచుకు పెట్టుకుపోయిందని కార్యకర్తలు భావిస్తున్నారు. బాబు జైలుకు వెళ్ళడం.. ఏపీ (AP)లో జగన్ (Jagan)ని ఎలాగైనా ఓడించాలనే తీవ్రమైన సంకల్పం.. వెరసి తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ కూడా వస్తుందో రాదో అనే భయంతో బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల చర్చ..

తెలంగాణ పై ఫోకస్ చేస్తే ఏపీలో ఓడిపోతామనే భయమే ఇప్పుడు టీడీపీని వెంటాడుతుందని నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికే నిరాశలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar)ఇప్పుడు పార్టీ నుంచి తప్పుకున్నారు. తన భవిష్య కార్యాచరణను ఆయన ప్రకటించబోతున్నారు. ఇప్పటి వరకు సారథ్యం అప్పగించారు కదా అని.. సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ.. పార్టీకి కాస్త జవసత్వాలు తీసుకువచ్చారు కాసాని.

ఇప్పటిదాకా తెలంగాణలో టీడీపీ ఎంతగా పతనం అయిపోయి ఉన్నప్పటికీ.. పార్టీకి ఒక కార్యవర్గం, కార్యాలయం మాత్రం నడుస్తూ వచ్చాయి. దీనికి కారణం ఇన్నాళ్లుగా టీడీపీని అంటిపెట్టుకొన్న కాసాని జ్ఞానేశ్వర్ అని అనుకొంటున్నారు.. మరోవైపు గతంలో అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఎల్ రమణ భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత.. దిక్కు లేకుండా పోయిన పార్టీకి కొన్నాళ్లకు కాసాని జ్ఞానేశ్వర్ సారథి అయ్యారు. పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ కలిగేలాగా పార్టీని నిర్మించారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేలుకోరిన చంద్రన్న తెలుగుదేశాన్ని పోటీనుంచి తప్పించే నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం కాసాని జ్ఞానేశ్వర్ చూపు ఎటువైపు ఉందనే ఆసక్తి రాజకీయవర్గాలలో మొదలైంది. భారాసలోకి వెళతారా, లేదా స్వతంత్రంగానే ఉంటారా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయవలసిందే..

You may also like

Leave a Comment