ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఆగడంలేదు. ఇటీవల హమాస్‌తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా ఆ గడువు ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. హమాస్‌ను (Hamas) తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్నని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ ఇదివరకే తేల్చి చెప్పారు.
నెతన్యాహూ చెప్పినట్లుగానే ఆ దేశ సైన్యం గాజా స్ట్రిప్‌పై (Gaza Strip) బాంబుల వర్షంతో బీభత్సం సృష్టించింది. దీంతో స్వల్ప విరామం అనంతరం గాజా మరోసారి రక్తసిక్తమైంది. ఈ కాల్పుల్లో 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అక్టోబర్ 24న జరిగింది.
నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, తర్వాత బందీల విడుదలకు మరో మూడు రోజులు పెంచారు. కాల్పుల విరమణ సమయంలో హమాస్ 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టారు. గడువు శుక్రవారం ఉదయంతో ముగియడంతో కాల్పుల విరమణను ఇంకొన్నిరోజులపాటు కొనసాగించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ కాల్పులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇంకా హమాస్ వద్ద 136 మంది బందీలుగా ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది.