ఇజ్రాయెల్ సైన్యం విచక్షణా రహితంగా దాడులు చేస్తుండటంతో గాజాలోని సగం మందికిపైగా నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల మందికిపైగా సాధారణ ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. చాలామంది తిండీతిప్పలు లేకుండా, తాగేందుకు మంచినీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా స్ట్రిప్‌లో (Gaza Strip) ఆ సంస్థ ఉనికే లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైన్యాలు విరుచుకుపడుతుండగా, గాజాపై హమాస్ (Hamas) పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ ప్రకటించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో 1200 మంది మృతిచెందారు. మరో 240 మందిని బంధించారు. దీంతో హమాస్ స్థావరంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఇప్పటివరకు గాజా స్ట్రిప్‌లో 11,240 మంది మృతిచెందారని, వారిలో 4630 మంది చిన్నారులు ఉన్నారని హమాస్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో హమాస్ పట్టుకోల్పోయిందని, ఇలా జరగడం గత 16 ఏళ్లలో ఇదే మొదటిసారని రక్షణ మంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఉగ్రవాదులంతా దక్షిణ గాజావైపు పారిపోతున్నారని ఆయన తెలిపారు. దీంతో ప్రజలంతా హమాస్ స్థావరాలను ఆక్రమిస్తున్నారని, గాజా ప్రజలకు అక్కడి ప్రభుత్వంపై ఏ మాత్రం నమ్మకం లేదని వెల్లడించారు. అయితే గాజాపై హమాస్ పట్టు కోల్పోయిందనడానికి ఆయన ఎలాంటి ఆధారాలను చూపలేదు.