హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం (Israel Hamas War) 74 రోజులుగా కొనసాగుతోంది. యుద్ధంతో గాజాలో ఇప్పటి వరకు 19వేల మందికి పైగా మృతిచెందారు. అయితే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక ప్రకటన చేశారు.
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సోమవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలను తగ్గించడంపై చర్చించారు. ఆస్టిన్, ఇతర అమెరికా అధికారులు గాజాలో పెద్ద సంఖ్యలో పౌర మరణాల గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కాల్పుల విరమణపై చర్చలు జరపలేదు.
ఇది ఇజ్రాయెల్ ఆపరేషన్ అని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ అన్నారు. గడువు తేదీలు లేదా షరతులు సెట్ చేయడానికి నేను ఇక్కడ లేను. గాజాలో రెండున్నర నెలలకు పైగా యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో ప్రస్తుతానికి చెప్పడం కష్టమని తెలిపారు. యుద్ధం ముగియడానికి సమయం పడుతుందని చెప్పారు.
గాలంట్.. ఇంతకు ముందు కూడా ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. గాజాలో యుద్ధం చాలా నెలల పాటు కొనసాగుతుందని ఇదివరకే చెప్పారు. మరోవైపు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్‌ను పూర్తిగా నాశనం చేసి, బందీలను విడిపించే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఉత్తర గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో సుమారు 110 మంది మృతిచెందారు.