Telugu News » Israel Hamas War : టార్గెట్ల పై నిప్పుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌.. మద్దతిస్తున్న దేశాలు..!!

Israel Hamas War : టార్గెట్ల పై నిప్పుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌.. మద్దతిస్తున్న దేశాలు..!!

హమాస్‌ మిలిటెంట్లు సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌ మసీదును అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నట్టు గుర్తించామని, ఈ మేరకు ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

by Venu

పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్ (Hamas), ఇజ్రాయెల్‌ (Israel)సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్‌ సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్‌ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజా (Gaja)తోపాటు సిరియా (Syria)లో రెండు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై నిప్పుల వర్షం కురిపించాయి.

హమాస్‌ మిలిటెంట్లు సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌ మసీదును అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నట్టు గుర్తించామని, ఈ మేరకు ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ ఇజ్రాయెల్‌ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌–లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇక శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.. మరోవైపు గాజాపై తమ సైనిక చర్య నెలల తరబడి ఉంటాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఉగ్రవాదం పై పోరులో ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, కెనడా, ఇటలీ పునరుద్ఘాటించాయి. కానీ ఈ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని కోరాయి.

మరోవైపు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇక గాజా ప్రజలకు ఇజ్రాయెల్‌ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్‌ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా ఈ యుద్ద పరిస్థితి చూస్తుంటే ఘోర విపత్తు సృష్టించే దిశగా సాగుతోందని ఐరాస ఆందోళన వెలిబుచ్చింది.

You may also like

Leave a Comment