ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war) ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలోని హమాస్, లెబనాన్‌లపై నిరంతరం దాడులకు పాల్పడుతోంది. తాజాగా లెబనాన్(Lebanon)పై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఈ దాడిలో ఐదుగురు మృతిచెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికార మీడియా వెల్లడించింది. ఖిర్మెట్ సెల్మ్(Khirmet Selm) ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఓ గర్భిణి సైతం ఉన్నట్లు పేర్కొంది.
ఇటీవల కూడా దక్షిణ లెబనాన్ సరిహద్దు గ్రామమైన హులాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇద్దరు దంపతులు సహా వారి కుమారుడు మృతిచెందాడు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి హిజ్భొల్లా ఉగ్రవాదులపై నిరంతరం కాల్పులకు తెగపడుతోంది.
ముఖ్యంగా లెబనాన్ దక్షిణ సరిహద్దులోనే దాడి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 30,960 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.