హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్ పౌరులు తరలివెళ్లాలని ఆదేశాలిచ్చింది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 11 వేల మందికి పైగా తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరోవైపు హమాస్ దాడుల్లో 12 వందల మంది తమ పౌరులు మృతిచెందారని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా పట్టీలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. బయటి ప్రపంచంతో గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఈ యుద్ధం వల్ల గాజాలో ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే, దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం.. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు.. అయినా ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నామని ఓ ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. ఖాన్ యూనిస్‌లో 4లక్షల వరకు జనాభా ఉంది. మళ్లీ వలసబాట పట్టక తప్పేలా లేదని వారు భయాందోళనకుగురవుతున్నారు.
మరోవైపు, ఖాన్ యూనిస్ నగరంలోని ఓ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ బాంబు దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది మృతిచెందినట్లు పాలస్తీనా మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో అత్యధికంగా చిన్నారులే ఉన్నారని వెల్లడించింది. మరోవైపు, ఉత్తర గాజాలో తనిఖీలు చేస్తున్న ఐడీఎఫ్ దళాలు కిండర్ గార్డెన్, ఎలిమెంటరీ స్కూల్‌లో పెద్దఎత్తున ఆయుధాలు గుర్తించాయి.