హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి ఐటీ (IT) కలకలం రేగింది. ఏకకాలంలో పలు చోట్ల అధికారులు తనిఖీలకు దిగారు. గురువారం తెల్లవారుజామునే వంద బృందాలుగా విడిపోయిన అధికారులు.. నగరంలోని పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆఫీసులతోపాటు ఇళ్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు నగర శివార్లలోని ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.
కూకట్ పల్లిలోని హిందూ ఫార్చ్యూన్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అలాగే, పూజాకృష్ణ చిట్ ఫండ్ ఆఫీస్, ఓనర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా, ఇతర చిట్ ఫండ్ సంస్థలకు సంబంధించిన యజమానుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు స్థిరాస్తి సంస్థల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి.
తనిఖీల్లో భాగంగా పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు అధికారులు. గతంలోనూ హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఐటీ సోదాలు జరిగాయి. కానీ, వంద బృందాలుగా ఏర్పడి ఒకేసారి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో పాటు కూకట్ పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎల్లారెడ్డిగూడలోని వ్యాపారి మాగంటి వజ్రనాథ్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పది మంది బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సీఆర్ఫీఎఫ్ బందోబస్తు మధ్య ఈ దాడులు కొనసాగిస్తున్నారు. అమీర్ పేట్, శంషాబాద్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి.