రాష్ట్రంలో ఐటీ అధికారులు బిజీ అయిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు ప్రచార పర్వంలో మునిగితేలుతున్న అభ్యర్థులకు ఐటీ అధికారులు టెన్షన్ పెడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి అనుచరులనూ వదలడంలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, వారి బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తూ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
తాజాగా నారాయణపేట జిల్లా(Narayanapet Dist)లో మరోసారి ఐటీ తనిఖీలు (IT Raids in Telangana ) కలకలం రేపాయి. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన.. డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయపన్ను శాఖ అధికారులు తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా బంగారం వ్యాపారి హరినారాయణ భట్టాడ్, వ్యాపారి బన్సీలాల్ లాహోటి నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో దాచి పెట్టిన భారీ నగదును ఎస్వోటీ అధికారులు పట్టుకున్నారు. ఇంట్లో నగదు గురించి పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి.. రూ.2.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల కింద బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రోహిత్‌రెడ్డి ఇంట్లో రూ.20లక్షల నగదుతో పాటు పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు బడా వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాలు, కింగ్స్ ఫంక్షన్ హాళ్లు, హోటళ్లలో సోదాలు జరిగాయి.