పన్ను ఎగవేత కంపెనీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో విస్తృతంగా ఐటీ సోదాలు చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు (IT Rides) నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది.
ఒడిశాలో జరుగుతున్న దాడుల్లో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న బంటీ సాహూ అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 19 బ్యాగుల్లో సొమ్మును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన బ్యాగుల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగానే నగదు ఉంటుందని అంచనా. పట్టుబడిన నగదును లెక్కించడానికి అధికారులు కౌంటింగ్ మెషిన్‌లను వాడుతున్నారు.
బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో రాంచీలోని ధీరజ్ సాహూకు చెందిన ఆఫీసులో మరో మూడు బ్యాగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఒడిశాలో దాడులు జరుగుతున్నాయి. కొందరు మద్యం వ్యాపారులకు సంబంధించిన ఆస్తులపై కూడా సోదాలు జరిగాయి.
ఇప్పటి వరకూ దాదాపుగా రూ.300 కోట్ల మేర సొమ్మును పట్టుబడినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మొదట డిసెంబర్ 6న డిస్టిలరీలపై దాడులు చేపట్టారు. ఆ తర్వాత బల్దియో సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ 156 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.