ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు పర్యటనతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. సీఎం పర్యటనకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు రాయలసీమ జోన్ నుంచి 300కు పైగా బస్సులను తీసుకువెళ్తున్నారు. బస్సుల సంఖ్యను కుదించడంతో పండగకు ఊరెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఒక్కో డిపో నుంచి పదుల సంఖ్యలో బస్సులను సభకు తరలించారు. దసరా నేపథ్యంలో ప్రజారవాణా సంస్థలు బుధ, గురువారాల్లో 100 బస్సులు ఏర్పాటు చేసింది. వాటిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికులు టికెట్లను కొని బస్టాండ్ వచ్చి చూస్తే ఒక్క బస్సు కనిపించడంలేదు. దీనికి కారణం కర్నూల్‌లో సీఎం పర్యటన కోసం బస్సులు సిద్ధం చేయడమే.
దీంతో రాయలసీమ జోన్ నుంచి బుధవారం మధ్యాహ్నం 200 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు, సాయంత్రానికి 300 వరకు బస్సులు అటువైపు తిప్పారు. ఉమ్మడి జిల్లాలోని 12డిపోల్లో ఒక్కో డిపో నుంచి 10 బస్సులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.కర్నూలు జిల్లాలో 54 మండలాలు, వెయ్యికి పైగా గ్రామాలున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా నుంచిగ్రామీణ ప్రాంతాలకు పండగకు వెళ్లే ప్రయాణికుల అధికంగా ఉంటారు.
నిత్యం గ్రామీణ ప్రాంతాలకు నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు తిరగాల్సిన బస్సులు కేవలం మూడు ట్రిప్పులకే పరిమితం చేశారు. దీంతో గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు గంటల కొద్దీ నిరీక్షణ తప్పలేదు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొర బస్సుల్లో 50మంది కూర్చోవాల్సినచోట కుక్కికుక్కి వందకు పైగా ప్రయాణికులను ఎక్కించాల్సి వచ్చింది. జనం నిలదీస్తారని అధికారులు బస్టాండ్ వైపుల వెళ్లడంలేదని సమాచారం.